Tuesday, March 25, 2014

her EYES!!!

Never I've seen in so many lives,
Such a beautiful haunting mysterious eyes!!

Everytime I fear, of having a blink,
Coz' I may lose with your eyes this wonderful link!!!

Though in this journey it's time for final goodbyes,
But my sight wants to be lost forever in the depths of your eyes!!!!



P.S: Saw a beautiful girl on a train, loved her eyes and then wrote this poem. Somehow mustered up all the courage I could and gave this to her. If by chance you are the same girl then leave a comment... :) {Hope is a good thing and good things must not die!!}


Tuesday, July 9, 2013

చెలి(మి)??

నిన్న మొన్న లేవుగా ఇలా,
ఈరోజెందుకో అనిపిస్తున్నావు కొత్త వింతలా!!

నిన్న మొన్న కనిపించని కొత్త అందాలు,
క్షణకాలంలో ఉదయించాయి నీలొ ఇలా!!

నిన్న మొన్న వినిపించని ఏవో గుసగుసలు,
నీ మౌనంలో వినిపిస్తున్నాయి ఈరొజు ఇలా!!

నిన్న మొన్న లేని చిరు సిగ్గులు,
నీ చిలిపి నవ్వుల్లో విరబూసాయిలా!!

నిన్న మొన్న లేని తియ్యందనాలు,
నీ పదాల పదనిసలో ఒలికాయిలా!!
 
నిన్న మొన్న ఎరుగని  కొత్త అనుభూతులు,
సంద్రంలా నా మదిని ముంచెత్తాయిలా!!

నిన్న మొన్న లేని  కోపతాపాలు,
నీ పిలుపు లేకుంటే నాలో రేగాయిలా!!

నిన్న మొన్న లేని అలజడులు,
నీ పలుకుల్తో మదిని తాకాయిలా!!

నిన్న మొన్న లేని సంకోచాలు,
నీతో పలికే పెదాలను బంధించాయిలా!!

నిన్న మొన్న ఎరుగని సంతోషాల్లో ,
నీ ఊసులాటల్తో తడిసానిలా!!


నిన్న మొన్న లేనుగా నేనిలా, 
పోల్చుకోలేనంతగా మారిపోయానెలా!!
తెలియటం లేదే నాకసలు తెలియటం లేదే,
ఇది నీలో వచ్చిన మార్పా, లేక నన్ను కమ్మేసిన మాయా!!
నువ్వైనా తీర్చగలవా ఈ సందేహం, లేక..

..నిన్నూ కమ్మేసిందా ఈ కమ్మని మైకం!!

చెలిమో చెలివో తెలియటం లేదే!!
నీకు ఇలానే ఉందా??
నిన్నటి నా నేస్తమా,
నేటి నా ప్రియతమా......... 



Thursday, December 27, 2012

గీతాంజలి


నమ్మలేకపోతున్నా ఈ నిజం,
నిన్ను కూడా కాటేసిందా  ఈ క్రూర కాలం!!
కరిగిపోయినా నా గీతాంజలి అందం, 
కనుమరుగవ్వదు నా గుండెల్లో తన రూపం!!! 


Saturday, December 22, 2012

నేను

అందరిలో ఒక్కడు, ఆ ఒక్కడిని నేను
ఒక్కడిలో ఏమున్నది? ఒక్కడిలో ఎంతున్నది??
కుతూహలంతో ప్రయోగం చేశా నేనొక్కడినై .

నా ప్రతి సుఖంలో భాగస్వామి నేనే,
నా ప్రతి దుఃఖంలో ఓదార్పు నేనే,
నా ప్రతి ఆవేశంలో ఆలొచన నేనే,
నా ప్రతి ఆలోచనకు బీజం నేనే,
నా ప్రతి సంఘర్షణలో వైరిని నేనే,
నా ప్రతి యుద్ధంలో సైన్యం నేనే.

నాలో కళకు ప్రేరణ నేనే, ప్రేక్షకుడిని నేనే.
నా సంశయంలో విద్యార్థిని నేనే, గురువు నేనే 
నాలో భక్తికి ఆరాధ్యం నేనే, ఆరాధకుడిని నేనే

ఇలా ఒక్కడిలో శక్తి ఉన్నది, ఒక్కడిలో లోతున్నదని తెలిసే క్రమంలో 

ఎవరు తట్టని నా గుండె తలుపులు మూతపడ్డాయి,
ఎవరు స్పృశించని నా మనసు పొరలు బండబారాయి,
ఎవరు వాడని నా భావ వారధులు కూలిపోయాయి.

నాలోనే సమాజం ఉందని తెలిసే సరికి సమాజంలో నేను లేను,
ఒక్కడినే అందరయ్యే క్రమంలో, అందరిలో ఒక్కడవ్వడం మరిచా నేను.
       

చరిత్ర

తెరచి చూస్తే తరతరాల చరిత్రలు,
వెలిగిపోతాయి రాజుల వైభోగాలతో, వీరుల విజయగాధలతో. 
తరచితరచి చూస్తే మానవీయ కోణంలో
బయటపడతాయి సామాన్యుల కన్నీటి గాధలు.

ఖండాలు దాటిన రోమను సామ్రాజ్యపు చక్రాలను 
కదిలించాయి బానిసల చెమట చుక్కలు.

సూర్యుడస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని 
కమ్ముకున్నాయి జాత్యహంకారపు నీలినీడలు.

అగ్రరాజ్యపు అమెరికా దేశ పునాదులను 
నిలిపాయి లెక్కలేని ఆదివాసీల సమాధులు. 

మహాగోప్పదని మురిసిపోయే మన భారత చరిత్ర 
కుళ్ళిపోయిన కులవ్యవస్థతో అయ్యింది అపవిత్రం.

అందుకే అన్నారు కాబోలు 



ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.........

Tuesday, October 2, 2012

శూన్యం

ఎక్కడని వ్రెతికేది, ఎక్కడని వ్రెతికేది??
అంతులేని విశ్వంలోనా, శూన్యం నిండిన గుండెలోనా!!

ఎలా అని  వ్రెతికేది, ఎలా తిరిగి తెచ్చేది?? 
మాయమైన నవ్వులని, చల్లారిన ఆవేశాన్ని,
అదృశ్యమైన కలలని, ఇంకిపోయిన కన్నీలని !!

ఎలా అని పలికేది, ఎలా అని తెలిపేది,
నా మనోవాక్యాలని, మనోహర కావ్యాలని?? 
మూగబోయిన గొంతుతోనా, సిరా లేని కలంతోనా!!

సరస్వతి, నా ప్రియ సరస్వతి!!
బంజరు అయిన నా హృదయమైదానంపై నవరసవర్షం కురిపించవా,
మోడుబారిన ఈ అక్షరవృక్షంకు కవితా ఫలాలని పండించవా,
ఆత్మలేని ఈ జీవచ్చవాన్ని మరలా నీవు ఆవహించవా ....  


Thursday, August 30, 2012

యువరాణి

కలలు కనే వేళ కవ్వించిన కిన్నెరసాని,
కలత చెందిన మనసును కరుణించిన ఓ దొరసాని,
కదిలే కలను చేయకు ఈ అందమైన అనుభవాన్ని
కరుణించి కారాదా నా మనోసామ్రాజ్యపు యువరాణి!!!